Kirti Vardhan: గ్లోబల్ ఎకానమీలో మూడో స్థానంలో భారత్..! 8 d ago

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసే విధంగా ఎకనామిక్ గ్రోత్ వేగంగా పెరుగుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. గ్లోబల్ ఎకానమీలో మూడో స్థానంలో ఉన్న భారత్, వికసిత్ భారత్ లో భాగంగా 2047 కి అగ్రస్థానంలోకి నిలుస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందుచూపు సంస్కరణల కారణంగా అభివృద్ధిలో పరుగులు తీస్తున్నామని, అందుకే భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు తెలిపారు. అయితే, వృద్ధిరేటులో గుజరాత్ తో పాటు ఏపీ ముందంజలో ఉందన్న ఆయన NDA సాధ్యంలో ఏపీ మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
విజయవాడలో స్టాలిన్ సెంట్రల్ మాల్ లో పూర్తిస్థాయిలో ఆధునీకరించిన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని కేంద్రమంత్రి కీర్తి వర్ధన్ సింగ్, ఎంపీ కేసినేని శివనాద్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ… ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారనీ, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం తాము ఎప్పుడూ పనిచేస్తూ ఉంటామన్నారు. అలాగే పాస్ పోర్ట్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు.
ఇటీవల యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సేవలు అందుబాటులోకి తీసుకోచ్చామన్నారు. దేశంలోనే పలు రాష్ట్రాల్లో అనేక అవకాశాలు ఉన్నాయనీ, హార్డ్ వర్కు చేసే వారికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసిందంటే మోడీనే కారణమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఐటి పరంగా కూడా దేశం అభివృద్ధి చెందిందనీ, మోడీ నాయకత్వాన్ని, ఆయన పనితీరును ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయనీ తెలియజేశారు. మనం అమలు చేస్తున్న టెక్నాలజీని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకున్నాయనీ, ప్రపంచంలో మన దేశం గ్లోబల్ ఎకానమీ పరంగా మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు.
గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు వృద్ది రేటులో ముందంజలో ఉన్నాయనీ, గుంటూరు నుంచి జర్మనీ, నెల్లూరు నుంచి న్యూయార్క్ వరకు ప్రపంచం మొత్తం మన వాళ్లు ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం లోనే ప్రింటింగ్, ఇతర అన్ని రకాల సేవలు ఇక్కడ నుంచే అందిస్తారనీ, రోజుకు ఐదు వందల దరఖాస్తులు నుండి వెయ్యి దరఖాస్తులకు పెరిగాయనీ పేర్కొన్నారు. సెంట్రల్ పాస్ పోర్ట్ కార్యాలయం కోసం రెండు ఎకరాలు కేటాయించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కీర్తి వర్ధన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.